Thursday, 14 November 2013

సైబర్ జోన్‌లో యాక్షన్ 'అభయ'

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ
ఆటోలు, క్యాబ్‌లపై ఐ యామ్ సేఫ్ అని స్టిక్కర్... దానిపై ఏ - 1234 నంబరు... దీని కింద గీతలుగా కనిపించే బార్ కోడ్... 'ప్రైవేటు'కు ప్రత్యేక ప్లాన్‌ది! ఆటో/క్యాబ్ ఎక్కిన ఐటీ ఉద్యోగి దాని నంబర్ ఫోన్ చేసి చెప్తే పర్యవేక్షించడానికి హైటెక్ కంట్రోల్ రూం. దీనికి మూడంకెల నంబర్. ఇది 'సెక్యూరిటీ' ప్రణాళిక!! అమ్మాయి ఉన్న ఆటో అనుమానాస్పదంగా తిరిగితే ఠక్కున పట్టుకునేందుకు సీసీ కెమెరాల వద్ద వాయిస్ బాక్స్‌లు. ఇదొక 'నిఘా' ప్లాన్!! మొత్తంగా సైబరాబాద్ పోలీసు అధికారులు, సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు రూపొందించిన 'అభయ' యాక్షన్ ప్లాన్ ఇది.

అటు 100... ఇటు 108 సెంటర్లకు భిన్నంగా ఐటీ కాల్‌సెంటర్‌ను ఏర్పాటుచేసే యోచనలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ఉంది. అభయ సంఘటన తర్వాత ఐటీ జోన్‌లో మహిళలు, ఉద్యోగినుల భద్రతకు పటిష్ఠ ప్రణాళికలు తయారవుతున్నాయి. సైబరాబాద్ పోలీసు అధికారులు, సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు సంయుక్తంగా వీటిని రూపొందిస్తున్నారు. డీజీపీ ప్రసాదరావు మూడురోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ఐటీ జోన్‌కు ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని కౌన్సిల్ ప్రతినిధులకు సూచించారు. జోన్ నుంచి ఉద్యోగినులు ఎక్కడికి వెళ్లాలన్నా కాల్‌సెంటరే ఆటోలు/క్యాబ్‌లను ఏర్పాటు చేసి, వాటి వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు వారు ఇంటికి చేరే వరకు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ విధానం ఆచరణలో సాధ్యం కాదని సెక్యూరిటీ కౌన్సిల్ అభిప్రాయపడుతోంది. ఈ విధంగా సెంటర్‌ను ఏర్పాటు చేస్తే అందులో పనిచేసే సిబ్బందిపైనే ఫిర్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కౌన్సిల్ ప్రతినిధులు భావిస్తున్నారు. ఐటీ జోన్‌లో ఉద్యోగుల కోసం ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయడం తప్పనిసరి అని నిర్ణయించారు. అయితే దీన్ని ఏవిధంగా... ఏయే హంగులతో నెలకొల్పాలన్న దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు కాబోయే కాల్‌సెంటర్‌ను మాత్రం జీపీఎస్ విధానాన్ని అనుసంధానం చేస్తారు. ఉద్యోగులు ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేసినా... అక్కడి నుంచి వారు ఎక్కడికి అడుగులు వేసినా... అన్నీ కాల్‌సెంటర్లోని సిబ్బందికి చకచకా తెలిసిపోతాయి.

'నిఘా'లోనూ వాయిస్
ఇప్పటి వరకు నిఘా మాత్రమే వేసిన సీసీ కెమెరాల నుంచి మాటలు వినిపిస్తాయి. "రాయదుర్గం చెక్‌పోస్ట్ యూ ఆర్ అలెర్ట్'' అని వార్నింగ్ కాల్ వస్తుంది. మరికొద్ది రోజుల్లో సైబరాబాద్‌లోని సీసీ కెమెరాలకు ఈ వ్యవస్థను అనుసంధానం చేయబోతున్నారు. ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో మొత్తం 41 సీసీ కెమెరాలు ఉన్నాయి. నూతనంగా మరో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రహదారులు, ఫైఓవర్లు, బస్‌స్టాప్‌లు, ఆటో/క్యాబ్‌లు ఆగే ప్రదేశాలను బంధించే విధంగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో 5 - 6 కెమెరాలను ఏర్పాటు చేస్తారు. అభయను అపహరించిన క్వాలిటీ ఇన్ ప్రాంతంలోనే నాలుగు సీసీ కెమెరాలు నెలకొల్పాలని సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ణయించింది. కొత్త వాటితోపాటు ఇప్పటికే నెలకొల్పిన కెమెరాల వద్ద చిన్న స్పీకర్ బాక్స్‌లను అమర్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాలను పర్యవేక్షించే సిబ్బంది అనుమానం వచ్చిన వాహనం ఏ మార్గంలో వెళ్తుందో అక్కడ ఉండే ట్రాఫిక్ సిబ్బందిని ఇక్కడి నుంచే అప్రమత్తం చేయవచ్చు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది ఇచ్చే సమాచారం సీసీ కెమెరాల వద్ద లేక సిగ్నలింగ్ వ్యవస్థ ఉండే సిబ్బందికి వినిపిస్తుంది. నూతనంగా ఏర్పాటు చేయబోయే కెమెరాల్లో పీటీజడ్ కేటగిరికి చెందిన వాటిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వీటిని కంట్రోల్ సెంటర్ నుంచి 360 డిగ్రీల కోణంలో తిప్పుతూ నిఘా కొనసాగించవచ్చు. కొత్త కెమెరాల ఏర్పాటుతోనే అన్ని సీసీ కెమెరాలకు హ్యాండ్ షేకింగ్ సిస్టంను అనుసంధానం చేస్తారు. అనుమానిత వాహనంపై రాయదుర్గంలో ఉన్న కెమెరా నిఘా వేస్తూనే వెంటనే కమిషనరేట్ వద్ద కెమెరాకు లింక్ అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ వాహనాన్ని చేజింగ్ చేస్తుంది. మొత్తం వ్యవస్థను ఒకేచోట కేంద్రీకృతం చేయాలని అధికారులు భావించారు. ఐటీ జోన్‌కు సంబంధించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ మాదాపూర్ ఉపకమిషనర్ కార్యాలయంలో ఉండేది. దీన్ని ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్‌లో ఉన్న ప్రధాన కంట్రోల్ రూంకు తరలించారు. ఇక నుంచి పర్యవేక్షణ అంతా ఇక్కడి నుంచే సాగుతోంది. సీసీ కెమెరాల ద్వారా ఐటీ జోన్‌లో పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక ఇన్‌స్పెక్టర్‌ను నియమించారు.
Courtesy-andhrajyothy

No comments:

Post a Comment