Monday, 21 October 2013

Atla Taddi Traditional India Festival-Telugu

ఈరోజు అట్లతద్ది. ఇది ఆధ్యాత్మికతనే కాదు వినోదాన్నీ అందించే పండుగ.

ఈ పండుగ ఎలా జరుపుకుంటారో ఒకసారి గుర్తుచేసుకుందాం.

అట్లతద్ది జరుపుకునే ఆడవాళ్ళు తెల్లవారుఝామునే మేల్కొని శుచి, శుభ్రత తో స్నానమాచరించి, ఉపవాసముండి, ఇంటిలో తూర్పుదిక్కున మంటపము యేర్పాటుచేసి గౌరీదేవి పూజ చేయాలి. ఇక రోజంతా అభోజనంగా ఉంటారు. ఆఖరికి మంచినీళ్ళు కూడా తాగరు.

సాయంత్రం గౌరీదేవికి పూజ చేసుకుని, చంద్రుని దర్శించుకుంటారు. ఆ తర్వాత అట్లు తిని, ఉపవాసం విరమిస్తారు. అప్పుడు 11 రకాల కూరలతో పసందైన భోజనం చేస్తారు. (పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగులతో అన్నం ).

అట్లతద్ది నోము నోచుకునే ఆడవాళ్ళు 11 మంది ముత్తయిదువలను ఆహ్వానిస్తారు.11 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయనముగా సమర్పించి, 11 రకాల ఫలాలను తినడం, 11 మార్లు తాంబూలం వేసుకోవడం, 11 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈపండుగలో విశేషము.

అట్లతద్దికి ముందురోజు కాళ్ళు, చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు.

గుమ్మాలకు తోరణాలు కడతారు.అట్లతద్దినాడు పిల్లలు, స్త్రీలు ఉయ్యాల ఊగుతారు. పరవశంగా ఊయల ఊగుతూ

''అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్...''

లాంటి సరదా పాటలు పాడుకుంటారు.

గౌరీదేవికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.

వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి, అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే.

వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు.

''ఇస్తినమ్మ వాయనం''

''పుచ్చుకుంటినమ్మ వాయనం''

''అందించానమ్మా వాయనం''

''అందుకున్నానమ్మా వాయనం''

''ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం''

''ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం''

అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే ''కార్వా చౌత్'' వేడుకతో సమానం. చిత్రమేమిటంటే రోమ్ లో కూడా ఇలాంటి ఆచారం ఉంది. జనవరి 21వ తేదీన వచ్చే ''సెయింట్ ఆగ్నెస్ ఈవ్'' మన అట్లతద్ది పండుగలాగే ఉంటుంది.

ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు. పశ్చిమ దేశాల ప్రభావంతో ''అట్లతద్ది'' లాంటి సంప్రదాయ పండుగలు జరుపుకునే ఆచారం సన్నగిల్లుతున్నప్పటికీ ఇంకా ఈ సంప్రదాయం మరుగున పడలేదు. ఇప్పటికీ చాలామంది పెళ్ళయిన స్త్రీలు ''అట్లతద్ది'' జరుపుకుంటున్నారు.

No comments:

Post a Comment