Thursday, 31 October 2013

అందర్నీ కలిపితే...అదే వ్యాపారం!

Sakshi | Updated: October 20, 2013 02:34 (IST)
అందర్నీ కలిపితే...అదే వ్యాపారం!
 విజయం
 కష్టం వృథా పోదు.. అంటారు. చక్కటి ఆలోచన కూడా వృథా పోదు... ఇప్పుడు ఇంకో మాట చేర్చాలి.  ఇది నమ్మండి. రుజువు అవసరం అనిపిస్తే ఈ కథనం చదవండి. ఇండియాలో పుట్టి, అమెరికాలో చదివి, ఇండియాలో వ్యాపారం మొదలు పెట్టి మూడేళ్లలో దాన్ని ఇరవై రెట్లు పెంచారు. ఆ కథేంటో... ఆమె సాధించిన విజయం ఏంటో తెలుసుకుంటే... విజయలక్ష్మి దరి చేరడానికి ఎన్ని మెట్లు అవసరమో తెలుస్తుంది.

 ఇరవై సంవత్సరాలు వెనక్కు వెళ్తే... 1993లో ఓ యువతి అమెరికాలోని ప్రతిష్టాత్మకమై మసాచుసెట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రీజనల్ ప్లానింగ్‌లో పీజీ పట్టా పొందింది. ఇపుడు ఆమెకు నలభై ఏడేళ్లు. ఈ మధ్య కాలంలో ముంబైకి చెందిన విజయ పాస్టాలా సాధించిన విజయమే అండర్ ద మ్యాంగో ట్రీ (యుటిఎంటి). అమెరికాకు చదువు కోసం వెళ్లినా అక్కడి అద్భుతాలేమీ ఆమెను అక్కడే ఉండేలా చేయలేదు. దీంతో ఇండియాకు తిరిగి వచ్చేశారు. ఆ ఏడాదే మహారాష్ర్టలో లాతూర్ భూకంపం. ఎవరో ఈమె సేవలు కోరితే... మనసులో కాస్త సేవా భావం కూడా ఉంది కాబట్టి అక్కడ సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేశారు.

 ఆ సందర్భంగా లాతూరు పరిసరాల్లో బాగా తిరిగారు. దీంతో అక్కడి ఆ వాతావరణం కూడా ఆమెకు తెలిసొచ్చింది. మామిడి చెట్టు కిందే సకల వ్యాపారాలు జరుగుతున్న ఓ సంత ఆమెను బాగా ఆకట్టుకుంది. అప్పుడే అనుకున్నారు. భవిష్యత్తులో తాను వ్యాపారం పెడితే దానికి ‘అండర్ ద మ్యాంగో ట్రీ’ అనే పేరే పెట్టాలని. ఆరోజు రానే వచ్చింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆమె వ్యాపారం పెట్టినా కూడా అదే పేరు పెట్టుకున్నారు.

 విజయ పన్నెండేళ్లు డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్‌గా పనిచేశారు. తల్లి కావడంతో కొంతకాలం ఆ ఉద్యోగం మానేశారు. అనంతరం తాత్కాలికంగా చేస్తూ చివరకు 2008లో వ్యాపారమనే గమ్యం వైపు అడుగులేశారు. కొందరు వ్యాపారం కూడా పరోక్షంగా ఒక సమాజ సేవే అంటారు. ఎందుకంటే అది అవసరాలు తీరుస్తుంది, ఉపాధి సృష్టిస్తుంది కాబట్టి. అయితే విజయ దానిని ప్రత్యక్ష సేవగా చేయడమే కాదు, లాభదాయకమైన వ్యాపారంగా కూడా చేశారు. విభిన్నమైన రంగంలో, వినూత్న విధానంతో సక్సెస్‌ను రుచిచూశారు. తనతో పాటు చాలామందిని వ్యాపారంలో భాగస్వాములను చేసి వారికి ఆ ఫలాలు అందించారు.

 కేవలం 3 లక్షల మూలధనంతో ప్రొప్రెయిటర్‌గా ‘అండర్ ద మ్యాంగో ట్రీ’ ఆవిర్భవించింది. అడవి నుంచి, పొలం నుంచి వచ్చే మూల ఉత్పత్తులకు ఒక బ్రాండ్ సృష్టించడం ద్వారా వాటి డిమాండ్ పెంచడం, పేదల జీవితాలను బాగుచేయడం ఆ కంపెనీ చేస్తుంది. ఈ అనుసంధాన ప్రక్రియలో కంపెనీ కూడా లాభపడుతుంది. పరిశుభ్రమైన, దీర్ఘకాలం నిల్వ ఉండే పద్ధతులతో ఆమె కమ్యూనిటీ బీ-కీపింగ్‌ను ప్రోత్సహించారు. ఈ తేనెటీగల పరిశ్రమలో ఆమె ఓ కొత్త కోణాన్ని కూడా చూశారు.

  ఫలదీకరణానికి కారణమయ్యేవి ఈ తెనేటీగలే. కాబట్టి వాటిని పెంచడం ద్వారా తేనెటీగల ఉత్పత్తితో పాటు పంట దిగుబడి కూడా పెరుగుతుందంటారామె. ఆమె గిరిజనుల నుంచి తేనెతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను కూడా స్వీకరించి వాటిని చక్కగా ప్రాసెస్ చేసి పట్టణ ప్రాంతీయులకు స్వచ్ఛమైన ఉత్పత్తులు అందజేస్తారు. అంతేకాదు... సేకరణలో కూడా పరిశుభ్రత, పద్ధతి ఉండాలని వ్యవసాయదారులకు, గిరిజనులకు చక్కటి శిక్షణ కూడా ఇస్తున్నారు. అంతేకాదు... సింగిల్ ఫ్లోరా హనీ (ఒకటే రకమైన పూల నుంచి తేనె సేకరించడం) అనే కొత్త ఉత్పత్తిని ఆమె మార్కెట్లో ప్రవేశపెట్టారు. దీనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్జీవోల నుంచి కూడా ఆమె ఈ ఉత్పత్తులను సేకరించి మార్కెట్ చేస్తున్నారు.

 మూడు లక్షలతో ప్రారంభమైన విజయ వ్యాపారం మూడేళ్లలో 60 లక్షల టర్నోవర్‌కు చేరింది. ముంబై, బెంగుళూరు, పుణె నగరాల్లో అవుట్‌లెట్లు పెట్టారు. వెబ్‌సైట్లో ఆన్‌లైన్ అమ్మకాలు చేస్తున్నారు. ప్రముఖ హోటళ్లతో ఒప్పందాలు చేసుకుని అక్కడ కూడా అమ్ముతున్నారు. ఈ మధ్యనే ‘నేచర్స్ బాస్కెట్’ సూపర్ మార్కెట్ ద్వారా ఢిల్లీలోకి ఈ ఉత్పత్తులు ప్రవేశించాయి. కేవలం ఒక చక్కటి ఆలోచన ఆమెను ఓ మంచి కంపెనీకి సీఈవోగా మార్చింది, పదుల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించింది, వందలాది మంది రైతులకు ఆదాయం పెంచింది... వినియోగదారులకు నాణ్యమైన, శుభ్రమైన ఉత్పత్తులను అందించింది. ఇంకా దినదినప్రవర్దమానమవుతోంది.
Courtesy-Sakshi

No comments:

Post a Comment