Thursday, 24 October 2013

'అభయ'కు చేటు చేసిన సెల్ ఫోన్ చాటింగ్!

అడుగడునా కీచక సంతతి పొంచివున్న కంప్యూటర్ కాలంలో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని 'అభయ' ఉదంతం చాటిచెబుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అందించిన సౌలభ్యాలకు బానిసలుగా మారి ఆత్మరక్షణ మర్చిపోవద్దని హెచ్చరిస్తోందీ ఘటన. చుట్టుపక్కల గమనించకుండా సెల్ ఫోన్ లో మునిగి తేలడం నేటి తరంలో చాలా మందికి బలహీనతగా మారడం దురదృష్టకర పరిణామం. స్వీయ రక్షణ గురించి పట్టించుకోకుండా సాంకేతి వెల్లువలో కొట్టుకుపోతుండండం ప్రమాదకర ధోరణిగా మారుతోంది.

ఒక్కోసారి మన నిర్లక్ష్యమే నేరగాళ్లకు ఆయుధమవుతుంది. 'అభయ' విషయంలోనూ ఇది రుజువయింది. తన హాస్టల్ కు వెళ్లేందుకు కిరాయి కారులో ఎక్కిన వెంటనే ఆమె సెల్ ఫోన్ చాటింగ్ లో మునిగిపోయింది. కారు ఎటు వెళుతున్నదీ గమనించకుండా స్నేహితుడితో సెల్‌ఫోన్ చాటింగ్‌లో లీనమయింది. ఆమె ఏమరపాటును దుండగులు తమకు అనువుగా మలుచుకున్నారు. కారును దారి మళ్లించి దారుణానికి పాల్పడ్డారు.

సెల్ ఫోన్ చాటింగ్ నుంచి అభయ తేరుకునేటప్పటికీ ఆలస్యమైపోయింది. సెల్ ఫోన్ ద్వారా బెంగళూరులోని తన స్నేహితుడి సమాచారం అందించినా ఫలితం లేకపోయింది. అతడి సలహాతో కేకలు పెట్టడంతో ఆమె సెల్‌ఫోన్ లాక్కున్న దుండగులు స్విచ్ఛాఫ్ చేశారు. కేకలు బయటకు విన్పించకుండా కారు అద్దాలను మూసేశారు. తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెను పాడుచేశారు.

బెంగళూరులోని స్నేహితుడికి సమాచారం అందించిన 'అభయ' కనీసం పోలీసు నంబర్ 100కు సమాచారమిచ్చినా దుండగులు బరితెగించి ఉండేవారు కాదేమో. చాలా మందికి ఈ నంబర్ ఉందన్న సంగతి తెలియపోవడం శోచనీయం. నేరాల నిరోధానికి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండడం ద్వారా కొన్ని ప్రమాదాల నుంచి బయటపడొచ్చు. తనను కాటేసేందుకు చూసిన ఆటోడ్రైవర్ల కళ్లలో పెప్పర్ పౌడర్ చల్లి ఓ యువతి ఇటీవల బయటపడిన ఉదంతం మనకు గుర్తుండే వుంటుంది. ఏదేమైనా కీచకుల పశువాంఛకు 'అభయ' బలైంది. ఆత్మరక్షణ పట్ల అతివలు అప్రమత్తంగా వ్యవహరిస్తే ఇటువంటివి చాలా వరకు తగ్గే అవకాశముంది.
Courtesy-Telugu people

No comments:

Post a Comment