Thursday, 31 October 2013

కవర్‌స్టోరీ : నేను..మలాలాను

మహిళలు చదువుకోకూడదు. బురఖాలు వేసుకోకుండా బయటకి రాకూడదు. కనీసం నెయిల్ పాలిష్ కూడా వేసుకోకూడదు... తాలిబన్ ఫత్వాలివి.
ఇస్లాం అందరికి సమాన హక్కులిచ్చింది. నేను చదువుకుంటే ఏమవుతుంది? బురఖా వేసుకోకుండా స్కూలుకు వెళ్తే ఏం చేస్తారు ?- అని ఒక పన్నెండేళ్ల పిల్ల ప్రశ్నించింది.
అగ్రరాజ్యం అమెరికాను సైతం గడగడలాడించిన తాలిబన్ ఈ ప్రశ్నలకు నివ్వెరపోయింది. ఏం చెప్పాలో తెలియక ఆమెపై బులెట్ల వర్షం కురిపించింది. కాని ఆ పిల్ల బులెట్లను సైతం తట్టుకొంది. దాడి జరిగిన ఏడాది లోపునే ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొంది. యూరోపియన్ యూనియన్ ప్రతి ఏడాది మానవ హక్కుల కార్యకర్తలకు ఇచ్చే అత్యున్నత బహుమతిని పొందింది. అతి చిన్న వయస్సులో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన వ్యక్తిగా చరిత్రకెక్కింది.
ఆమె పేరు మలాలా. ఆమె ఆత్మకథే 'ఐయామ్ మలాలా'. ఈ నెల 9వ తేదీన విడుదలయిన ఈ పుస్తకంలో కొన్ని ఆసక్తికర భాగాలే ఈ వారం కవర్ స్టోరీ..

అర్థరాత్రి పుట్టిన దేశం నాది. మధ్యాహ్నం సమయంలో నేను మరణానికి చేరువయ్యాను..
ఏడాది క్రితం.. నేను ఇంటి నుంచి స్కూలుకు వెళ్లా. మళ్లీ ఇప్పటి దాకా నేను మా ఇంటికి తిరిగి వెళ్లలేదు. నన్ను తాలిబన్లు బుల్లెట్లతో కాల్చారు. కొందరు నేను మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లనన్నారు. కాని ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వెళ్తానని నా మనసుకు తెలుసు. మనం ఎంతగానో ప్రేమించిన దేశాన్ని వదిలి వెళ్లాలని ఎవరూ అనుకోరు. నేనూ అంతే! ప్రతి రోజు ఉదయం నేను నిద్ర లేచిన వెంటనే కళ్లు తెరిచి చూస్తా. నా స్వదేశం నుంచి ఐదు గంటల దూరంలో ఉన్నాననే సత్యం ఒక్కసారిగా గుర్తుకొస్తుంది. ఇక్కడ అందుబాటులో ఉన్న వసతులతో పోలిస్తే నా దేశం వందల ఏళ్లు వెనకబడి ఉంది. సుఖవంతమైన జీవితానికి అవసరమైనవన్నీ ఇక్కడ ఉన్నాయి.

ప్రతి కుళాయి నుంచి వేన్నీళ్లు, చన్నీళ్లు వస్తాయి. స్విచ్ వేసిన వెంటనే లైట్లు వెలుగుతాయి. చమురు దీపాల అవసరమే ఉండదు. బజారు నుంచి గ్యాస్ సిలిండర్లు తేవాల్సిన అవసరముండదు. ఇక్కడ మన తిండి కూడా ప్యాకెట్లలో తినటానికి రెడీగా ఉంటుంది. కిటికీలో నుంచి బయటకు చూస్తే పెద్ద పెద్ద భవంతులు కనబడతాయి. నల్లటి రోడ్ల మీద వాహనాలు ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటాయి. మరో వైపు చూస్తే లాన్లు కనిపిస్తాయి. కానీ నా కళ్లు మూసుకుంటే- స్వాట్ వ్యాలీ- కళ్ల ముందు కనిపిస్తుంది. ఒక వైపు మంచు కొండలు... మరో వైపు పచ్చని చెట్లు... వేగంగా ప్రవహించే నదులు... ఇవన్నీ గుర్తుకొస్తే నా మనసు పులకించిపోతుంది. నా స్కూలు గుర్తుకొస్తుంది. నా స్నేహితురాలు మోనిబా కళ్లముందు కదులుతుంది. నేను, నా స్నేహితులు స్కూల్లో కలుసుకొని కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. కాని నేను లండన్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉన్నది నిజం. కల చెదిరిపోతుంది.

***

2012, అక్టోబర్ 9. నా జీవితం మారిపోయిన రోజు. స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి. వాస్తవానికి నాకు పరీక్షలంటే పెద్దగా భయం లేదు. స్వాట్ వ్యాలీలో తాలిబన్ల పాలన తర్వాత స్కూలు బోర్డులన్నీ మాయమైపోయాయి. బయట నుంచి చూస్తే లోపల స్కూలు ఉందనే విషయం కూడా తెలియదు. నాలాంటి అమ్మాయిలకు స్కూలు ఒక వేరే ప్రపంచం. అప్పటి దాకా మా ముఖాలను కప్పిఉంచిన స్కార్ఫ్‌లన్నీ మాయమైపోతాయి. మేము మా బ్యాగులన్నింటినీ క్లాస్‌రూమ్‌లో ఉంచి మార్నింగ్ అసెంబ్లీ కోసం గ్రౌండ్‌లోకి వస్తాం. పైన ఆకాశం.. చుట్టూ పర్వతాలు.. మధ్యలో మేము. ఒక అమ్మాయి 'ఆసాన్ భాష్' (స్టాండ్ ఎట్ ఈజ్) అని అరుస్తుంది. మేము మా కాళ్లను నేలకు వేసి కొడతాం. 'అల్లా' అని అరుస్తాం.

ఆ తర్వాత ఆమె 'హోషియార్' (అటెన్షన్) అని అరుస్తుంది. మేమందరం మళ్లీ అల్లా అని అరుస్తాం. ఆ స్కూలును నేను పుట్టకముందు మా నాన్న స్థాపించాడు. గ్రౌండ్‌కు ఎదురుగా ఉన్న గోడ మీద 'కుషాల్ స్కూల్' అని పెద్ద పెద్ద అక్షరాల్లో రాసి ఉంటుంది. మేము వారానికి ఆరు రోజులు స్కూలుకు వెళ్తాం. ఉర్దూ గ్రామర్ చదువుతాం. ఇంగ్లీషులో స్టోరీలు రాయటానికి ప్రయత్నిస్తాం. నా స్నేహితుల్లో చాలామందికి డాక్టర్ కావాలనేది ఒక కల. వారు డాక్టర్లు కావటం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. కాని స్కూలు బయట చాలా మంది అలా అనుకోరు. స్వాట్ వ్యాలీలోని ప్రధాన నగరమైన మింగోరాకు చెందిన కొందరికి, తాలిబన్‌లకు అమ్మాయిలు చదువుకోవటం ఇష్టం లేదు.


ఆ రోజు కూడా మామూలుగానే ప్రారంభమయింది. పరీక్ష మాత్రం ఒక గంట ఆలస్యంగా మొదలయింది. ఆ రోజు నేను ఆలస్యంగా లేచా. అందువల్ల ఉదయాన్నే లేచి చదువుకోవటానికి వీలు కాలేదు. ఒక గంట ఆలస్యంగా పరీక్ష ప్రారంభం కావటం వల్ల నాకు చదువుకోవటానికి సమయం చిక్కింది. ఉదయాన్నే మా నాన్న ప్రతి రోజు మాదిరిగానే 'టైం అయిపోయింది..జానేమన్' అని లేపాడు. 'కొద్దిసేపు పడుకోనీ..అబ్బా' అన్నా. ఆ తర్వాత మా అమ్మ వచ్చి 'పిషో' అని గట్టిగా అరిచింది. పర్షియన్‌లో పిషో అంటే పిల్లి అని అర్థం. మా అమ్మ నాకు పెట్టిన ముద్దు పేరిది. "బాబీ..లేటు అయింది..'' అని గట్టిగా అరిచా. మా సంస్కృతిలో మగవాళ్లందరిని సోదరులని పిలుస్తాం. ఆడవాళ్లను సోదరి అని పిలుస్తాం. సోదరుడి భార్య వదిన అవుతుంది. మా నాన్న స్కూలు పెట్టినప్పుడు అమ్మను అక్కడకు తీసుకువెళ్లాడు. అక్కడ పనిచేసేవారు- అమ్మను బాబీ(వదిన) అని పిలిచేవారు. అమ్మను ఏడిపించాలంటే అప్పుడప్పుడు నేను కూడా అలా పిలుస్తూ ఉంటా.

మా ఇంటి ముందు ఒక రూమ్ ఉంది. ఆ రూమ్‌లో ఒక బెడ్, ఒక బీరువా ఉంటుంది. ఈ ఫర్నిచర్‌ను నేనే కొన్నా. స్వాట్ వ్యాలీలో శాంతి కోసం ప్రచారం చేసినందుకు, ఆడపిల్లలు స్కూలుకు వెళ్లాలని ప్రచారం చేసినందుకు నాకు వచ్చిన అవార్డుల ద్వారా ఈ ఫర్నిచర్ కొన్నాను. ఆ బీరువాలో నాకు క్లాసులో ఫస్ట్ వచ్చినందుకు బహుమతిగా ఇచ్చిన ట్రోఫీలు ఉన్నాయి. నేను రెండే రెండుసార్లు క్లాస్ ఫస్ట్ రాలేదు. ఆ రెండు సార్లు మల్కానూర్ ఫస్ట్ వచ్చింది. నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఈసారి నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలని కష్టపడి చదివా.

స్కూలు మా ఇంటికి దగ్గరలోనే ఉంది. గతంలో నడిచే వెళ్లేదాన్ని. తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత బస్సులో వెళ్ళాల్సి వచ్చేది. బస్సులో వెళ్తే ఐదు నిమిషాలు పడుతుందంతే. స్కూలుకు వెళ్లే దారిలో డాక్టర్ హుమయూన్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. మా స్కూల్లో మాస్టర్లకు హఠాత్తుగా జట్టు రావటానికి డాక్టర్ హుమయూన్ కారణమని మేము జోకులు వేసుకుంటూ ఉంటాం. నాకు బస్సులో వెళ్లడమంటే ఇష్టం. బస్సు డ్రైవర్ ఉస్మాన్ అలీని 'భాయిజాన్'(సోదరుడు) అని పిలుస్తాం. అతను రకరకాల కథలు చెప్పి మమల్ని నవ్విస్తూ ఉంటాడు.

నేను బస్సులో వెళ్లటానికి మరో కారణం కూడా ఉంది. ఏడాది నుంచి నాకు తాలిబన్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. పత్రికల్లో వార్తల రూపంలో కొన్ని బెదిరింపులు వచ్చాయి. చిన్న చిన్న చీటీల మీద బెదిరింపులు రాసి గుర్తు తెలియని వ్యక్తులు నా మీద విసిరేవారు. దీనితో మా అమ్మ నన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ నడిచి స్కూలుకు వెళ్లనిచ్చేది కాదు. తాలిబన్లు ఎప్పుడు మహిళలను లక్ష్యంగా చేసుకోలేదు. అందువల్ల నేను పెద్దగా భయపడలేదు. మా నాన్నపై దాడి చేస్తారనే భయం మాత్రం ఉంది. మా నాన్న తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. అందుకే వాళ్లు మా నాన్న స్నేహితుడు జహీద్‌ఖాన్‌ను ఆగస్టులో నుదుటి మీద కాల్చి చంపేశారు. మసీదుకు ప్రార్థనలకు వెళ్తున్న సమయంలో అందరూ నాన్నను- "జాగ్రత్తగా ఉండు.. ఇక నీ వంతే'' అని హెచ్చరిస్తూ ఉండేవారు. ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు భయమేసేది.

మా వీధిలోకి బస్సు రాదు. అందువల్ల వీధి చివరే బస్సు దిగి ఇంటికి నడిచివచ్చేదాన్ని. ఎవరైనా దాడి చేస్తే ఇక్కడే చేస్తారని అనుకొనేదాన్ని. నేను వీధిలో నడుస్తూ ఉంటే హఠాత్తుగా ఒక టెర్రరిస్టు నా మీదకు దూకి కాల్చేసినట్లు కలలు వచ్చేవి. ఆ సమయంలో ఏం చేయాలని ఆలోచించేదాన్ని. కాలికి ఉన్న చెప్పు తీసి ఆ టెర్రరిస్టును కొట్టాలనుకొనేదాన్ని. కానీ అలా చేస్తే నాకు, టెర్రరిస్టుకు తేడా ఏముందనిపించేది. దాని కన్నా అతనిని- "నన్ను కాల్చు. కానీ నేను చెప్పేది విను. నువ్వు చేస్తున్నది తప్పు. నాకు, నీకు ఎలాంటి శతృత్వం లేదు. ప్రతి అమ్మాయి స్కూలుకు వెళ్లాలని నేను అనుకుంటున్నా. అంతకు మించి నాకేం తెలియదు'' అని ప్రార్థించాలనిపించేది.

రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత గేటు తాళం పెట్టేదాన్ని. చనిపోయిన తర్వాత ఏమవుతుందని ఆలోచిస్తూ పడుకొనేదాన్ని. నా ఆలోచనలన్నీ నా ప్రాణ స్నేహితురాలు మోనిబాకు చెప్పేదాన్ని. నాకు మోనిబా చిన్నప్పటి నుంచి స్నేహితురాలు. జస్టిన్‌బీవర్, ట్విలైట్ మూవీస్ దగ్గర నుంచి ఫేస్‌క్రీమ్‌ల దాకా అన్ని విషయాలు మాట్లాడుకొనేవాళ్లం. మోనిబాకు ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది కోరిక. కానీ వాళ్లింట్లో ఒప్పుకోరని తెలుసు. అందువల్ల అందరితోను డాక్టర్ అవుతానని చెబుతూ ఉండేది. మా సమాజంలో అమ్మాయిలు టీచర్లు కావాలి. లేదా డాక్టర్లు కావాలి. ఇతర వృత్తుల్లో చేరటానికి అవకాశమే ఉండదు. నాకూ చిన్నప్పుడు డాక్టర్ కావాలని ఉండేది. ఆ తర్వాత సైంటిస్ట్ కావాలనుకున్నా. రాజకీయాల్లోకి వెళ్లాలని ఉండేది. ఈ విషయం చెబితే మోనిబా భయపడింది. తాలిబన్లకు తెలిస్తే చంపేస్తారని హెచ్చరించింది. "ఏం భయపడకు. మనలాంటి వాళ్ల కోసం తాలిబన్లు బులెట్లు వేస్ట్‌చేసుకోరు'' అని ఆమెకు చెప్పా.

ఆ రోజు బస్సు హారన్ మోగిన వెంటనే మేమందరం పరిగెత్తుకుంటూ వీధి చివరకు వెళ్లాం. బస్సు అంటే మామూలు బస్సు కాదు. టయోటా టౌన్ ఏస్ ట్రక్కులో మూడు బెంచీలు వేసి ఉండేవి. దానిలో 20 మంది విద్యార్థులం, ముగ్గురు టీచర్లు కూర్చునేవాళ్లం. నా పక్కనే మోనిబా కూర్చునేది. మా బ్యాగులన్నీ బెంచీల కింద పెట్టేవాళ్లం.


ఆ రోజు ఉదయం ఎండగా ఉంది. బస్సు లోపల చాలా ఉక్కగా ఉంది. ట్రక్కు అన్ని వైపులా మూసేసి ఉంది కాబట్టి బయటకు చూడటానికి కూడా లేదు. బయట బాగా ఎండగా ఉందని మాత్రం తెలుస్తోంది. బస్సు కుడివైపునకు తిరగటం మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత అంతా ఒక కలలా జరిగిపోయింది. మాకు కుడివైపు స్వాట్ వ్యాలీ తొలి ఆర్థిక మంత్రి షేర్ మహ్మద్ ఖాన్ సమాధి ఉంది. ఎడమ వైపు ఒక ఫ్యాక్టరీ ఉంది. రోడ్డుకు అడ్డంగా లేత రంగు బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చాడు. బస్సును ఆపమని చేతులు ఊపాడు. "కుషాల్ స్కూలు బస్సు ఇదేనా?'' అని మా డ్రైవర్‌ను అడిగాడు.

భాయ్‌జాన్ అవునని సమాధానమిచ్చాడు. "కొంత మంది పిల్లలకు సంబంధించిన సమాచారం కావాలి'' అని ఆ వ్యక్తి డ్రైవర్‌ను అడిగాడు. "స్కూలు ఆఫీసులో తెలుసుకోండి'' అని భాయ్‌జాన్ సమాధానమిచ్చాడు. ఒక వైపు అతను మాట్లాడుతుంటే- మరో వైపు ఒక వ్యక్తి బస్సు వెనకవైపు వచ్చాడు. "ఎవరో జర్నలిస్టు నిన్ను ఇంటర్వ్యూ చేయటం కోసం వస్తున్నాడు..'' అంది మోనిబా. ఆ వస్తున్న వ్యక్తి మోహానికి రుమాలు కట్టి ఉంది. ఒక కాలేజీ స్టూడెంట్‌లా ఉన్నాడు తప్ప జర్నలిస్టులా లేడు. బస్సుపైకి ఎక్కి- "మలాలా ఎవరు?''అని అడిగాడు. ఎవరూ ఏం మాట్లాడలేదు. కాని చాలా మంది నావైపు చూశారు. బస్సు మొత్తం మీద మొహాన్ని కవర్ చేసుకోంది నేను ఒక్కదాన్నే.

అతను నల్లటి తుపాకీని బయటకు తీసాడు. బస్సులో ఉన్నవారందరూ గట్టిగా అరవటం మొదలుపెట్టారు. నేను మోనిబా చేతిని గట్టిగా పట్టుకున్నా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అతను మూడు సార్లు కాల్చాడని నా స్నేహితులు తర్వాత చెప్పారు. ఒక బుల్లెట్ నా కంటిలోపలి నుంచి వెళ్లిపోయింది. మరో బుల్లెట్ ఎడమ భుజాన్ని తాకింది. మూడో బుల్లెట్ నా ఎడమ చెవికి తగిలింది. నాపక్కన కూర్చున్న షాజియా, కైనాత్ రియాజ్‌లకు కూడా బులెట్లు తగిలాయి. కాలుస్తున్న సమయంలో ఆ వ్యక్తి చేతులు వణికాయని నా స్నేహితులు చెప్పారు. నేను ఆసుపత్రికి వెళ్లే సమయానికి మోనిబా ఒళ్లంతా రక్తమే.

నా పేరు వెనక కథ
అఫ్గానిస్థాన్‌లో పుట్టిన గొప్ప మహిళలలో మలాలా ఒకరు. పస్థూన్ తెగకు చెందిన మలాలా గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. 1880లో అఫ్గానిస్థాన్‌పై బ్రిటీష్ వారు దండెత్తారు. అఫ్గానిస్థాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో బ్రిటీష్‌వారు ఘోరంగా విఫలమయ్యారు. బ్రిటీష్ వారిని ఘోరంగా ఓడించటంలో పస్థూన్ తెగ కీలకమైన పాత్ర పోషించింది. పస్థూన్‌లు బ్రిటీష్ వారిపై తిరగబడటంలో మలాలా పాత్ర చిరస్మరణీయమైనది.

కాందార్ సమీపంలో మైవాండ్ అనే చిన్న గ్రామంలో ఒక పశువుల కాపరి కూతురు మలాలా. ఆమెకు చిన్నప్పుడే మరొక పశువుల కాపరితో నిశ్చితార్థం చేసేశారు. బ్రిటీష్ వారితో యుద్ధం రావటంతో- మలాలా నాన్న, ఆమెకు కాబోయే భర్త కూడా యుద్ధానికి వెళ్లారు. వారందరికి సాయం చేయటం కోసం మైవాండ్‌కు చెందిన మహిళలందరూ యుద్ధరంగానికి వెళ్లారు. మలాలా, ఇతర మహిళలు యుద్ధరంగానికి వెళ్లే సమయానికి- బ్రిటీష్ వారి చేతితో పస్థూన్లు ఓడిపోతున్నారు. తమ వాళ్లు ఓడిపోవటం చూసి మలాలా సహించలేకపోయింది. తన బురఖాను తీసేసింది. బ్రిటిష్ సైనికుల వైపు పరుగెత్తుకు వెళ్లింది. తన వాళ్లకేసి చూసి- "మైవాండ్ యుద్ధంలో మీరు అమర వీరులు కాకపోతే, మీ జీవితాలు వృధా'' అని గట్టిగా అరుస్తూ బ్రిటీష్ సైనికుల బుల్లెట్లకు నేలకొరిగింది.

తమ గ్రామానికి చెందిన ఒక యువతిని బ్రిటీష్ సైనికులు చంపటం చూసి పస్థూన్లు తట్టుకోలేకపోయారు. బ్రిటీష్ సైన్యాన్ని ఊచకోత కోశారు. రెండో అఫ్గాన్ యుద్ధంలో ఎవరూ మరచిపోలేని సంఘటన ఇది. ఇప్పటికీ అఫ్గానిస్థాన్‌లో అనేక స్కూళ్లకు ఆమె పేరే ఉంటుంది. అయితే నాకు ఆ పేరు పెట్టడం మా తాతకు ఇష్టం లేదు. "అది ఒక విషాదమైన పేరు. మలాలా అంటే విషాదభరితమైనది అని అర్థం. ఆ పేరు వద్దు'' అని అడ్డుకున్నాడు. కాని మా నాన్న నాకు ఆ పేరే పెట్టాడు. చిన్నప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చినా- నా పేరు వెనకున్న కథను చెప్పేవాడు.

ఇలా మొదలైంది..
ఒక రోజు అబ్దుల్ హై కాకర్ అనే బీబీసీ రేడియో రిపోర్టర్ నుంచి మా నాన్నకు ఫోన్ వచ్చింది. తాలిబన్ల పాలనలో ఒక స్కూలుకు వెళ్లే అమ్మాయి జీవితం ఎలా ఉందో ప్రపంచానికి తెలియజేయటానికి వారు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నారని కాకర్ చెప్పాడు. ఒక అమ్మాయి తన ప్రతి రోజు జీవితాన్ని డైరీ రూపంలో రాస్తే దానిని వారు తమ వెబ్‌సైట్‌లో పెడతారు. దాని కోసం ఎవరైనా ఒక అమ్మాయిని చూడమని కాకర్ నాన్నను కోరాడు. నాన్న తన దగ్గర పనిచేసే అనేక మందిని అడిగాడు. ఎవరూ ముందుకు రాలేదు. ఒక రోజు నాన్న ఈ విషయాలు ఎవరితోనో మాట్లాడుతుంటే నేను విన్నా. "నేను రాస్తా నాన్న..'' అని అడిగా. నాన్న వెంటనే అంగీకరించాడు. అప్పటి దాకా నాకు డైరీ ఎలా రాయాలో తెలియదు. పైగా మా ఇంట్లో కంప్యూటర్ కూడా లేదు. మొదట్లో కాకర్ ప్రతి రోజు నాకు ఫోన్ చేసేవాడు.

రకరకాల ప్రశ్నలు అడిగేవాడు. నా కలల గురించి, నా ఆలోచనల గురించి, వ్యక్తుల గురించి అడిగేవాడు. వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టి డైరీ రూపంలో రాసేవాడు. దానిని బీబీసీ ఉర్దూ వెబ్‌సైట్‌లో వారానికి ఒకసారి పెట్టేవారు. నా అసలు పేరు పెడితే ప్రమాదం కాబట్టి- వెబ్‌సైట్‌లో నా పేరును గుల్ మకాయ్ (జొన్న పువ్వు) అని పెట్టేవారు. నా డైరీలో మొదటి పేజీ 2009, జనవరి 9వ తేదీన వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయింది. నెల రోజుల లోపులోనే ఈ డైరీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించటం మొదలుపెట్టింది. ప్రపంచంలో అనేక పత్రికలు దీనిని ప్రచురించాయి. ఈ డైరీ ఎవరు రాస్తున్నారనే విషయాన్ని తాలిబన్లు కూడా ఆరా తీయటం మొదలుపెట్టారు.


మహిళల జీవితం దుర్భరం
గ్రామంలో మహిళల జీవితం అనేక కట్టుబాట్ల మధ్య నడిచేది. మహిళలు బురఖా వేసుకోకుండా బయటకు రాకూడదు. సన్నిహిత బంధువులతో తప్ప ఇతర పురుషులతో మాట్లాడకూడదు. నేను టీనేజర్‌ను అయిన తర్వాత కూడా బురఖా వేసుకొనేదాన్ని కాదు. దీనితో మా బంధువులకు చాలా కోపంగా ఉండేది. ఒక రోజు బంధువొకాయన మా నాన్న దగ్గరకు వచ్చి- "మలాలా బురఖా వేసుకోవటం లేదు.. వేసుకొమ్మని చెప్పు'' అని ఒత్తిడి పెట్టాడు. మా నాన్న- "అది నా కూతురు. దాన్ని ఎలా పెంచాలో నాకు తెలుసు. మీ పని మీరు చూసుకోండి'' అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత మా బంధువులు ఆ విషయం గురించి మాట్లాడటం మానేశారు. కాని మేము పస్థూన్ తెగ సంప్రదాయాలను పాటించటం లేదని పుకార్లు పుట్టించటం మొదలుపెట్టారు. మా తెగలో మహిళలను సరిగ్గా చూసేవారు కాదు. వారికి చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేవారు.

కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఎవరితోనైనా ప్రేమలో పడితే- నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. మా ఇంటి దగ్గర సీమ అనే ఒక అమ్మాయి ఉండేది. తను చాలా అందంగా ఉండేది. ఆమె మా గ్రామంలో ఉన్న ఒక కుర్రాడిని ప్రేమించింది. పెద్దలకు తెలియకుండా ఇద్దరూ కలుసుకుంటూ ఉండేవారు. ఒక రోజు ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. కాని ఆమెను ఇంట్లోవారే విషం ఇచ్చి చంపేశారని ఆ తర్వాత తెలిసింది. ఇలాంటి వాటితో పాటుగా- మా తెగలో స్వర అనే ఒక సంప్రదాయముండేది. మాకు, వేరే తెగవారికి మధ్య తగువు వస్తే- దానిని పరిష్కరించుకోవటానికి ఒక అమ్మాయిని ఆ తెగ వారికి ఇచ్చేసేవారు. ఆ తెగలో పురుషులు ఆ అమ్మాయిని తమ సుఖాలకు వాడుకొనేవారు. ఈ ఆచారాన్ని ప్రభుత్వం నిషేధించింది. కాని అనధికారికంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మా ఊర్లో సురయ అనే ఒక విధవ ఉండేది. ఆమె వేరే తెగకు చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది.


పస్థూన్ సంప్రదాయం ప్రకారం- గ్రామ పెద్దలకు తెలియకుండా విధవలు పెళ్లి చేసుకోకూడదు. ఈ విషయం తెలిసి సురయ కుటుంబం సభ్యులు జిర్గా (పంచాయితీ) పెట్టించారు. అవతల తెగకు చెందిన వారిని కూడా పిలిపించారు. వారి తెగలో ఉన్న అందమైన అమ్మాయిని, మా తెగలో ఉన్న ఎందుకూ పనికి రాని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని తీర్పు ఇచ్చారు. రెండు తెగల మధ్య వైరం- ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసింది.. ఇలాంటి సంప్రదాయాల వల్ల మహిళలు నష్టపోతున్నారని చాలా సార్లు మా నాన్నతో వాదించేదాన్ని. గతంలో పరిస్థితులు మరింత కఠినంగా ఉండేవని చెప్పేవాడు నాన్న. తాలిబన్లు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రకరకాల చట్టాలు చేశారు. మహిళలు నవ్వటాన్ని నిషేధించారు. తెల్ల రంగు పురుషులకు మాత్రమే చెందుతుందని ప్రకటించి- మహిళలు తెల్ల బూట్లు వేసుకోవటాన్ని నిషేధించారు. గోళ్ల రంగు వేసుకుంటే కొరడాతో కొట్టేవారు. ఇలాంటివన్నీ నాన్న చెబుతున్నప్పుడు నా ఒళ్లు భయంతో జలదరించేది.

అనువాదం : సివిఎల్ఎన్
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment