Thursday, 31 October 2013

ఫెంగ్ షూ : మహిళా శక్తికి చిహ్నం నలుపు

-శ్రీభావ

రంగులు మనలో రకరకాల భావావేశాలను ప్రేరేపిస్తాయి. తెల్ల రంగు చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆరెంజ్ సత్సంబంధాలను పెంపొందిస్తుంది. నలుపు మిస్టరీకి, శక్తికి చిహ్నం. మట్టి రంగు స్థిరత్వాన్నిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం...

నలుపు చీకటికి, చిక్కదనానికి సంకేతం. ఫెంగ్ షూ సిద్ధాంతాల ప్రకారం- నలుపు మిస్టరీకి, శక్తికి కూడా చిహ్నం. మహిళలలో నిబిడీకృతమైన ఆధ్యాత్మిక శక్తిని కూడా నలుపుతో పోలుస్తారు. మిగిలిన రంగులతో పోలిస్తే నలుపుకు ఎక్కువ శక్తి ఉంటుంది. అందుకే దీనిని ఎక్కువగా ఉపయోగించకూడదు. ముఖ్యంగా పిల్లల గదులలోను, బెడ్ రూమ్‌లలోని సీలింగ్‌లలోను దీనిని అస్సలు వాడకూడదు. ఉత్తర, దక్షిణ, ఆగ్నేయ దిశలలో ఈ రంగును వాడవచ్చు. ఇంటి ముఖద్వారానికి దీనిని వాడితే ఎక్కువ శక్తి లభిస్తుంది. వృత్తిపరంగా ఎక్కువగా రాణించాలనుకొనేవారు ఉత్తర దిశలో ఈ రంగును ఎక్కువగా వాడాలి. సాధారణంగా ఈ రంగును గోడలకు వాడరు కాబట్టి- ఫర్నిచర్‌లోను, ఫొటో ఫ్రేములలోను ఈ రంగు ఉంటే మంచిది.

తెలుపు (కొత్త ఆశలకు నాంది)
ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం- తెలుపు నిర్మలత్వానికి, స్వచ్ఛతకు, కొత్త ఆశలకు చిహ్నం. మొత్తం అన్ని రంగులలో ఉన్న శక్తి- తెలుపులో ఉంటుంది. అన్ని యోగా పద్ధతుల్లోను తెలుపునకు ఒక విశిష్టత ఉంది. దాదాపు అన్ని సంస్కృతులలోను- పెళ్లి కూతురుకు తెల్లరంగు బట్టలే వేస్తారు. కొత్త ఆశలకు, కొత్త జీవితానికి నాందిగా తెలుపును భావిస్తారు కాబట్టే ఈ రంగు బట్టలు వేస్తారు. ఈ రంగును వాడటం వల్ల రకరకాల లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంట్లో ఏ ప్రాంతంలోనైనా దీనిని ఉపయోగించవచ్చు. పశ్చిమ, వాయవ్య దిక్కుల్లో లోహంతో చేసిన ఫర్నిచర్ లేదా ఫ్రేములకు తెల్లని రంగు వేసి ఉంచితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. తూర్పు, ఆగ్నేయ దిక్కుల్లో మొత్తం తెల్లరంగును వేయటం వల్ల వ్యాపారాభివృద్ధి జరుగుతుంది.

ఆరంజ్ (సామాజిక సంబంధాలకు చిహ్నం)
ఇంట్లో ఎర్ర రంగును ఉపయోగించటానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు- దానికి బదులుగా ఆరంజ్ రంగును వాడవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలను పెంపొందించటానికి ఈ రంగు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శీతల వాతావరణంలో నివసించే వారు తమ ఇళ్లలో ఈ రంగును వేయించుకోవటం వల్ల అదనపు శక్తి అందుతుంది. వృత్తిలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాలంటే దక్షిణ దిక్కులోను, ప్రేమ-పెళ్లిళ్లకు సంబంధించిన వ్యవహారాలు ఫలించాలంటే నైరుతీ దిక్కులోను, ఆధ్యాత్మికంగా బాగా ఎదగాలంటే ఈశాన్య దిక్కులోను ఈ రంగును వాడాలి. అయితే పశ్చిమ దిక్కులో ఈ రంగును ఎక్కువగా వాడటం వల్ల సృజనాత్మకత మందగిస్తుంది. వాయవ్య దిక్కులో వాడితే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఏర్పడతాయి. తూర్పు దిక్కులో ఎక్కువగా ఉపయోగిస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆగ్నేయంలో వాడితే ఆర్థిక నష్టం జరుగుతుంది.

మట్టి రంగు (స్థిరత్వానికి చిహ్నం)
కాఫీ, చాక్‌లెట్, గట్టి చేవ కర్ర- ఇలా ప్రకృతిలో మనకు ఎంతో ఉపకరించే వస్తువులన్నీ మట్టి రంగులోనే ఉంటాయి. ఒకప్పుడు ఫెంగ్‌షూలో ఈ రంగుకు పెద్ద ప్రాధాన్యత లేదు. కానీ ఈ మధ్య కాలంలో దీనికి చాలా ఆదరణ లభిస్తోంది. ఆరోగ్యం కావాలనుకొనేవారు ఈ రంగును తూర్పు దిక్కులోను, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకొనే వారు ఆగ్నేయ దిక్కులోను, కీర్తి ప్రతిష్టలు కావాలనుకొనేవారు దక్షిణ దిక్కులోను ఈ రంగును విరివిగా వాడాలి. ఇంటి ముఖ ద్వారం, వంటింటి ద్వారం, బెడ్ రూమ్‌లో వెనక గోడలకు ఈ రంగును వాడితే మంచిది.

ఫెంగ్ షూ : ఫెంగ్ షూ రంగుల కథ

- శ్రీభావ

కాంతి, రంగులు- ఈ రెండూ లేకపోతే ఈ ప్రపంచం నిస్సారమే. అంతే కాదు. అసలు మానవ మనుగడే కాంతిపై ఆధారపడి ఉంది. ఆ కాంతే మనుషులకు శక్తిని ఇస్తుంది. అలాంటి కాంతి అనేక రంగుల మిశ్రమం. ఈ రంగులను విడదీస్తే వాటిలోని శక్తి కూడా విడిపోతుంది. దానిని ఎలా ఉపయోగించుకోవాలో ఫెంగ్ షూ చెబుతుంది.

తెల్ల రంగు చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎర్ర రంగు విప్లవాన్ని గుర్తుచేస్తుంది.. ఆకుపచ్చ కంటికి ఆహ్లాదంగా ఉంటుంది.. ఇలా రంగులు మనలో రకరకాల భావావేశాలను ప్రేరేపిస్తాయి.

ఫెంగ్ షూ రంగులు ప్రతిఫలించే భావోద్వేగాలను మాత్రమే కాదు.. అవి ప్రసారం చేసే శక్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఇళ్లలోను, ఆఫీసుల్లోను రంగుల ద్వారా శక్తి సమతౌ ల్యం ఎలా సాధ్యమవుతుందో తెలియజేస్తుంది. అలాంటి కొన్ని రంగులను ఇప్పుడు చూద్దాం..

ఎరుపు- అగ్నికి చిహ్నం
అగ్ని సూర్యుడికి, జీవానికి చిహ్నం. సృష్టికి, వినాశనానికి కూడా చిహ్నమే. ఇది లేకపోతే జీవమే లేదు కాబట్టి అదృష్టానికి, సంతోషానికి ఎరుపు రంగు ప్రాతినిధ్యం వహిస్తుంది. హిందువులు పెళ్లి సమయంలో పెళ్లికూతురుకి ఎరుపు చీర కట్టడం సంప్రదాయం. చైనీయులు కూడా ఎరుపును తమ అదృష్టరంగుగా భావిస్తారు. అయితే ఎరుపు రంగును అవసరమైన మేరకు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఎరుపు రంగును డ్రాయింగ్ రూమ్‌లో, వంటింట్లో ఉపయోగించవచ్చు. కాని పిల్లల గదుల్లో తక్కువగా వాడాలి. తూర్పు, ఆగ్నేయం మూలల్లో ఎర్రటి రంగు వేసిన చెక్క ఫర్నిచర్ కాని సూర్యుడి పెయింటింగ్స్ కాని వాడితే మంచిది. పశ్చిమం, వాయవ్య దిక్కుల్లో లోహాలతో చేసిన పెయింటింగ్‌లకు ఎర్ర రంగు వేస్తే మంచిది. దక్షిణంలో ఎర్రటి రంగు ఉంటే కీర్తి ప్రఖ్యాతులు వస్తాయి.

పసుపు- శుభాలకు చిహ్నం
పసుపు శుభానికి చిహ్నం. ఎక్కడ పసుపు రంగు ఉంటుందో అక్కడ ఆనందం, ఆహ్లాదం వెల్లివిరుస్తాయని ఫెంగ్ షూ సిద్ధాంతం చెబుతుంది. పిల్లల గదుల్లోను, ఆఫీసుల్లోను, డ్రాయింగ్ రూమ్‌లలోను ఈ రంగు వేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ముదురు రంగులు వేసిన గదులలో కూడా పసుపు రంగు పెయింటింగ్‌లను పెడితే మంచిది. పసుపు రంగు క్రిస్టల్స్‌ను డ్రాయింగ్ రూమ్‌లో వేళ్లాడదీస్తే ఇంట్లో వారికి ఎటువంటి అనారోగ్యం కలగదు. పసుపు రంగును తూర్పు, ఆగ్నేయం, పశ్చిమం, వాయవ్యాలలో తక్కువ వాడాలి. దక్షిణం, నైరుతి, ఈశాన్య ప్రాంతాల్లో విరివిగా వాడచ్చు.

నీలం- నిశ్చలతకు చిహ్నం
ఆకాశ నీలం, సముద్ర నీలం, ఇండిగో నీలం- ఇలా రకరకాల నీలం షేడ్స్, వాటి వల్ల వచ్చే ఫలితాలను ఫెంగ్‌షూ సిద్ధాంతం వివరిస్తుంది. ఆరోగ్యం కోసం తూర్పు భాగంలోను, ధనం కోసమైతే ఆగ్నేయ భాగంలోను, కెరీర్ కోసమైతే ఉత్తర భాగంలోను నీలం రంగు వేయటం మంచిది. పిల్లల గదుల్లో సీలింగ్‌కు నీలం రంగు వేయటంవల్ల వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. పడక గదిలో నీలం రంగు క్రిస్టల్స్ పెట్టుకోవటం వల్ల ప్రశాంతత చేకూరుతుంది. నీలం, తెలుపు రంగులను కలిపి వాడితే ఇంట్లో శక్తివినియమంలో ఎటువంటి తేడాలు రావు.

ఆకుపచ్చ- ఆరోగ్యానికి చిహ్నం
ఫెంగ్‌షూ సిద్ధాంతం ప్రకారం ఆకుపచ్చ ఆరోగ్యానికి చిహ్నం. అంతే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను పరిహరించే సామర్థ్యం ఈ రంగుకు ఉంటుంది. ఇంట్లో పచ్చటి మొక్కలను పెట్టుకోవటం వల్ల శక్తి సమతుల్యం అవుతుంది. అందువల్ల ఇంట్లో అరిసా చెట్లు (కొబ్బరి చెట్ల మాదిరి ఆకులు ఉంటాయి) పెట్టుకుంటే శక్తి ప్రసారం సజావుగా సాగుతుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేసిన పరిశోధనల్లో ఈ చెట్టు ఇంట్లో ఉండే అన్ని వాసనలను తొలగిస్తుందని తేలింది.

(వచ్చే వారం తెలుపు, నలుపు, నారింజ, మట్టి రంగులు ఏం చెబుతాయో తెలుసుకుందాం)
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment