Sakshi | Updated: October 27, 2013 03:17 (IST)
ఆమెకు జీవితం మీద ఆశ, ఆసక్తి రెండూ పోయాయి. కళ్ల ముందే తండ్రి, భర్త, కొడుకు, అత్త అందరూ పోయారు. దీంతో అను కుటుంబమే కాదు.. థెర్మాక్స్ గ్రూప్ కూడా దిక్కు తోచని స్థితిలో పడిపోయింది.
xజాబితాలో చోటు దక్కించుకున్న ధనవంతురాలిగానే మనకు తెలుసు. కానీ కంపెనీని నడిపిస్తున్న భర్త హఠాన్మరణం పాలైనపుడు దిక్కుతోచని స్థితిలో ఉన్న సంస్థ పగ్గాలు చేపట్టి దానిని వేల కోట్లకు విస్తరింపజేసిన ఘనత ఆమెది. వ్యక్తిగత, వ్యాపార జీవితంలో ఆటుపోట్లను తట్టుకుని.. విజేతగా ఎదిగిన అను అఘా జీవితం మహిళా లోకానికే కాదు.. ఎదగాలనుకుంటున్న వారందరికీ ఒక స్ఫూర్తి!
అను పుట్టింది సంపన్న కుటుంబంలోనే. కానీ ఆమె ఎదుర్కొన్న కష్టాలు మాత్రం మామూలువి కావు. 1996 వరకు ఆమె ఓ సాధారణ మహిళే. అను తండ్రితో కలిసి భర్త రోహింగ్టన్ అఘా 40 ఏళ్ల క్రితం ఆరంభించిన సంస్థ ...థెర్మాక్స్ గ్రూప్. బాయిలర్లను తయారు చేసే ఇంజినీరింగ్ సంస్థ ఇది. కొన్నేళ్లలోనే సంస్థ గొప్ప ప్రగతి సాధించింది. ఐతే 1996లో గుండెపోటు వల్ల రోహింగ్టన్ హఠాన్మరణం పాలయ్యారు. అప్పటికి కంపెనీ బాధ్యతలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. దీంతో ఆమెకు దాని గురించి ఏమీ అవగాహన లేదు. పోనీ తండ్రి అయినా చూస్తాడనుకుంటే ఆయన అంతకుముందే మరణించారు. అదేం విచిత్రమో రోహింగ్టన్ చనిపోయిన కొన్ని రోజులకే అతని తల్లి (అను అత్త) కూడా ప్రాణాలు విడిచింది. ఈ బాధ చాలదన్నట్లు ఇంకో ఏడాది గడిచేలోపు 25 ఏళ్ల అను పెద్ద కొడుకు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. కచ్చితంగా చెప్పాలంటే ఆమెకు జీవితం మీద ఆశ, ఆసక్తి రెండూ పోయాయి. కళ్ల ముందే తండ్రి, భర్త, కొడుకు, అత్త అందరూ పోయారు. దీంతో అను కుటుంబమే కాదు.. థెర్మాక్స్ గ్రూప్ కూడా దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. రోహింగ్టన్ చనిపోయిన ఏడాదే థెర్మాక్స్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. చక్కటి పనితీరు ఉన్న కంపెనీ కావడంతో షేర్ ధర రూ.400 వరకు ఉండేది. అయితే ఆయన మరణంతో సమర్థులైన నిర్వాహకులు కరవై సంస్థ షేరు రూ.36కు పడిపోయింది!
సంస్థ గురించి పైపైన తెలిసిన అను, తాను ఎన్నో బాధల్లో, కంపెనీ అగాధంలో ఉన్నపుడు బాధ్యతలు చేపట్టారు. తమ కుటుంబానికి 62 శాతం షేర్స్ ఉండటంతో అను సంస్థ ఛైర్‌పర్సన్ అయ్యారు. అప్పటికే సంస్థలో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ అంత పెద్ద బాధ్యతలు నిర్వర్తించడం ఆమెకు సవాలే అయింది. పైగా సంస్థ దిశానిర్దేశం లేకుండా సాగుతోంది. ఈ స్థితిలో అను దృఢంగా నిలబడ్డారు. యోగాతో ముందు తాను స్థిమిత పడ్డారు. ఆ తర్వాత సంస్థలో అవ్యవస్థను సరిచేశారు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు కొందరు ఉద్యోగుల్ని తొలగించాలన్న కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కొన్ని సంస్థలతో మాట్లాడి పెట్టుబడులు రాబట్టారు. అనుభవజ్ఞులతో ఓ టీం ఏర్పాటు చేసి.. వారి ఆలోచనల్ని అమలు చేసి సంస్థను మళ్లీ పట్టాలపైకి ఎక్కించారు. 2004 నాటికి థెర్మాక్స్ గ్రూప్ విలువ రూ.3 వేల కోట్లకు పైనే. అదే ఏడాది అను అఘా సంస్థ నుంచి తప్పుకుని.. తన కూతురు మెహర్‌ను ఛైర్‌పర్సన్‌ను చేశారు. 2007లో ఫోర్బ్స్ ప్రకటించిన భారతీయ ధనవంతుల జాబితాలో అను ఎనిమిదో స్థానం సంపాదించారు.
వ్యాపార బాధ్యతలకు దూరమయ్యాక అను ఊరికే కూర్చోలేదు. సామాజిక సేవపై దృష్టిపెట్టారు. థెర్మాక్స్ సోషల్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు పెద్ద ఎత్తున నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ఆమె కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారం అందజేసింది. 2012లో అను రాజ్యసభ సభ్యురాలిగానూ నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ‘టీచ్ ఇండియా’ ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ‘‘ఏడాది వ్యవధిలో భర్త, కొడుకు చనిపోయినపుడు ఎంత బాధపడ్డానో చెప్పలేను. ఆ సమయంలో నా మీద నేను జాలిపడుతూ, ఏడుస్తూ కూర్చోవడమా.. లేదా ధైర్యంగా పోరాడటమా అని ఆలోచించాను. తర్వాత రెండో మార్గాన్నే ఎంచుకున్నాను. ఆ సమయంలో ‘విపాసన’ అనే ధ్యాన కార్యక్రమం నాలో మార్పు తెచ్చి.. నన్ను శక్తిమంతురాలిగా మార్చింది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుని సంస్థను నిలబెట్టాను. సంస్థ నుంచి తప్పుకున్నాక సమాజం కోసం ఏదైనా చేయాలనిపించి సేవా కార్యక్రమాల్లో అడుగుపెట్టాను’’ అని ఓ సందర్భంలో తన పట్టుదల గురించి బయటపెట్టారు అను అఘా. మనిషికి విజ్ఞానమే కాదు... మానసిక స్థైర్యం చాలా పెద్ద అవసరం.
- ప్రకాష్ చిమ్మల
Courtesy-Sakshi
No comments:
Post a Comment